Home  »  Featured Articles  »  నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపం.. ఇదే గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ జైత్రయాత్ర!

Updated : Jun 9, 2025

(జూన్‌ 10 నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా..)

నటసింహ నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వింటేనే అభిమానులు ఆనందంతో కేరింతలు కొడతారు. ‘జై బాలయ్యా..’ అంటూ తమ అభిమాన కథానాయకుడికి జేజేలు పలుకుతారు. బాలయ్య చెప్పే వీరోచిత డైలాగ్స్‌కి పులకించిపోతారు. తెరపై బాలకృష్ణ కనిపిస్తే చాలు అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. పవర్‌ఫుల్‌ డైలాగులు చెప్పాలన్నా, శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించాలన్నా అది బాలయ్యకే సాధ్యం అనేది నందమూరి అభిమానుల్లో ఉన్న అభిప్రాయం. దానికి తగ్గట్టుగానే ప్రేక్షకుల్ని, అభిమానుల్ని తన డైలాగులతో చైతన్యపరిచే బాలయ్య.. ఆ తరహా క్యారెక్టర్సే చేస్తూ ఆకట్టుకుంటున్నారు. నటరత్న నందమూరి తారక రామారావు నట వారసుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసి 50 ఏళ్ళుగా తన కెరీర్‌ను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. క్రమశిక్షణ, వృత్తి పట్ల గౌరవం తండ్రి నుంచి ఆయనకు సంక్రమించిన మంచి లక్షణాలు. ఎన్టీఆర్‌లాగే పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ అభిమానుల్ని గణనీయంగా పెంచుకున్నారు బాలకృష్ణ. 1974లో ‘తాతమ్మకల’ చిత్రంతో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం ఎలా సాగింది, సినిమాల పరంగా, రాజకీయంగా ఆయన సాధించిన విజయాలు ఏమిటి? అనే విషయాలు తెలుసుకుందాం. 

1960 జూన్‌ 10న మద్రాసులో నటరత్న నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు మగ సంతానంలో ఆరోవాడిగా జన్మించారు నందమూరి బాలకృష్ణ. అప్పుడు చిత్ర పరిశ్రమ మద్రాస్‌లోనే ఉండడంతో బాలకృష్ణ బాల్యం అంతా అక్కడే గడిచింది. కొంత వయసు వచ్చిన తర్వాత హైదరాబాద్‌ వచ్చి నిజాం కాలేజీలో బి.కాం పూర్తి చేశారు. 14 సంవత్సరాల వయసులో తండ్రి దర్శకత్వంలో రూపొందిన తాతమ్మకల చిత్రంలో తొలిసారి నటించారు బాలయ్య. 1974లో ఈ సినిమా విడుదలైంది. అప్పటి నుంచి 1983 వరకు 11 సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు. వీటిలో 6 సినిమాలకు ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించారు. 1975లో వచ్చిన అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో ఎన్టీఆర్‌కు తమ్ముడిగా నటించారు. అలాగే దానవీరశూర కర్ణ చిత్రంలో అన్నయ్య హరికృష్ణ అర్జునుడి పాత్ర పోషించగా, కుమారుడు అభిమన్యుడు పాత్రలో బాలకృష్ణ నటించారు. 

1984లో సంతాన భారతి, పి.వాసు దర్శకత్వంలో వచ్చిన సాహసమే జీవితం చిత్రంతో సోలో హీరోగా పరిచయమయ్యారు బాలయ్య. ఈ సినిమా తర్వాత డిస్కోకింగ్‌, జననీ జన్మభూమి చిత్రాలు చేసినా అవి ఆశించిన విజయాన్ని అందించలేదు. అదే సంవత్సరం కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసిన మంగమ్మగారి మనవడు చిత్రం ఘనవిజయం సాధించి బాలకృష్ణ కెరీర్‌ను టర్న్‌ చేసింది. విడుదలైన అన్ని సెంటర్స్‌లో శతదినోత్సవం జరుపుకుంది. హైదరాబాద్‌లో 565 రోజులు ప్రదర్శింపబడి రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ సినిమాలోని తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు బాలకృష్ణ. ఆ తర్వాత శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర చిత్రంలో చేసిన సిద్ధయ్య పాత్ర నటుడిగా ఆయనకు చాలా మంచి పేరు తెచ్చింది. 

ఆ తర్వాత కథానాయకుడు, ఆత్మబలం, బాబాయ్‌ అబ్బాయ్‌, భలే తమ్ముడు, నిప్పులాంటి మనిషి వంటి సినిమాల్లో విభిన్నమైన చిత్రాలతో ముందుకెళ్తున్న బాలకృష్ణకు ముద్దుల కృష్ణయ్య చిత్రంతో విజయపరంపర మొదలైంది. ఆ సంవత్సరం ఆయన చేసిన సినిమాల్లో ఆరు సినిమాలు సూపర్‌హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. ఒక హీరో ఒకే సంవత్సరం చేసిన ఆరు సినిమాలు సూపర్‌హిట్‌ కావడం అనే రికార్డు ఇప్పటికీ బాలకృష్ణ పేరు మీదే ఉంది. ఆ తర్వాత మువ్వగోపాలుడు, రాము, ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌, భలేదొంగ, ముద్దుల మావయ్య, బాలగోపాలుడు, నారీ నారీ నడుమ మురారి, లారీ డ్రైవర్‌ వంటి సూపర్‌హిట్‌ సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా ఎదిగారు బాలయ్య. ఆ తర్వాత చేసిన ఆదిత్య 369, రౌడీ ఇన్‌స్పెక్టర్‌ వంటి సినిమాలు ఆయన రేంజ్‌ని మరింత పెంచాయి. 

నిప్పురవ్వ, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలిసింహం, వంశానికొక్కడు సినిమాలు బాలకృష్ణను టాలీవుడ్‌లో టాప్‌ హీరోని చేశాయి. ఆ తర్వాత కూడా కొన్ని హిట్‌ సినిమాల్లో నటించిన బాలకృష్ణకు సరికొత్త ఇమేజ్‌ను తెచ్చిపెట్టిన సినిమా సమరసింహారెడ్డి. సెంటిమెంట్‌, కామెడీ, యాక్షన్‌ సన్నివేశాలు వంటివి చేస్తూ వచ్చిన బాలయ్యను ఒక ఫెరోషియస్‌ క్యారెక్టర్‌లో చూపించి ప్రేక్షకులకు, అభిమానులకు ఒక కొత్త బాలకృష్ణను పరిచయం చేశారు దర్శకుడు బి.గోపాల్‌. అంతకుముందు బాబాయ్‌ అబ్బాయ్‌, సీతారామకళ్యాణం వంటి సినిమాల్లో కామెడీని అద్భుతంగా పండిరచిన బాలయ్య.. సమరసింహారెడ్డితో దాన్ని పక్కన పెట్టి రౌద్ర పూరితమైన పాత్రలు పోషించడానికి పరిమితమైపోయారు. ఎందుకంటే బాలయ్యను ఆ తరహా పాత్రల్లో చూసేందుకే ప్రేక్షకులు, అభిమానులు ఇష్టపడేవారు. ఆ తర్వాత నరసింహనాయుడు చిత్రంతో మరో బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నారు. ఇక అక్కడి నుంచి ప్రతి సినిమాలోనూ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్స్‌ చేస్తూ ఆ తరహా క్యారెక్టర్లు తాను మాత్రమే చెయ్యగలనని ప్రూవ్‌ చేసుకున్నారు. లక్ష్మీనరసింహా, సింహా, లెజెండ్‌, అఖండ, భగవంత్‌ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్‌ వంటి పూర్తి యాక్షన్‌ సినిమాలు చేస్తూ తిరుగులేని మాస్‌ హీరోగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అఖండ2తో మరో బ్లాక్‌బస్టర్‌ని తన ఖాతాలో వేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 

నటరత్న ఎన్‌.టి.రామారావు పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. బాలకృష్ణ కూడా ఆ తరహా పాత్రలు పోషించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. దానవీరశూర కర్ణ, అక్బర్‌ సలీం అనార్కలి, వేములవాడ భీమకవి, శ్రీమద్‌విరాటపర్వం, శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం వంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించిన బాలకృష్ణ.. సోలో హీరో అయిన తర్వాత భైరవద్వీపం చిత్రంతో మొదలుపెట్టి శ్రీకృష్ణార్జున విజయం, ఆదిత్య 369, శ్రీరామరాజ్యం, పాండురంగడు, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సినిమాల్లో.. జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రలు అత్యద్భుతంగా పోషించి ఆ తరహా సినిమాలు చెయ్యడం నందమూరి వంశానికే సాధ్యం అని మరోసారి నిరూపించారు. 

ఇక ఆయనకు లభించిన పురస్కారాల గురించి చెప్పాలంటే.. సినీ పరిశ్రమకు చేస్తున్న సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందించింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డును బాలకృష్ణకు అందించింది. నరసింహనాయుడు, సింహా, లెజెండ్‌ చిత్రాలకు మూడు సార్లు ఉత్తమ నటుడుగా నంది అవార్డు అందుకున్నారు. అలాగే వివిధ సంస్థలు బాలకృష్ణకు పలు పురస్కారాలు అందించాయి.

వ్యక్తిత్వ పరంగా చూస్తే.. టాలీవుడ్‌లో ఉన్న టాప్‌ హీరోలందరి కంటే భిన్నమైన వ్యక్తి బాలకృష్ణ. తన మనసులో ఉన్నది నిర్మొహమాటంగా బయటికి చెప్పడం, తప్పు జరిగితే దాన్ని నిర్భయంగా ఖండిరచడం వంటి లక్షణాలు ఎన్టీఆర్‌ నుంచి అలవడ్డాయి. తన సహనటీనటులను, తన కంటే సీనియర్‌ నటీనటులను గౌరవించడం, నిర్మాతల శ్రేయస్సు కోరుకోవడం, దర్శకులకు పూర్తి స్వేచ్ఛనివ్వడం వంటివి బాలకృష్ణలో ఉన్న మంచి లక్షణాలు. సినిమాల్లోనే కాదు, టీవీ షోల్లోనూ అంతే ఉత్సాహంగా పాల్గొంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు బాలయ్య. ఆహా ఓటీటీలో స్ట్రీమ్‌ అయ్యే అన్‌స్టాపబుల్‌ షోకి బాలకృష్ణ హోస్ట్‌ అని ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎంతో గంభీరంగా ఉండే ఆయన దగ్గరికి వెళ్ళడానికే చాలా మంది భయపడుతుంటారు. కానీ, ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అనీ, ఎంతో జోవియల్‌గా మాట్లాడతారని బాలకృష్ణను దగ్గరగా చూసినవారు చెప్తుంటారు. అందుకే అన్‌స్టాపబుల్‌ షోకి ఆయన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ షో ఎంత పాపులర్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. షోకి వచ్చిన సెలబ్రిటీస్‌తో ఎంతో సరదాగా మాట్లాడుతూ వారితో కలిసి పోతారు. షో చూస్తున్నవారికి ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ రాజకీయ ప్రస్థానం గురించి చెప్పాలంటే.. 1982లో ఎన్‌.టి.రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత జరిగిన ప్రతి ఎలక్షన్‌లో ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడు కోసం ప్రచారం చేశారు బాలకృష్ణ. 2014లో హిందూపూర్‌ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 2019లో, 2024లో కూడా గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. ఇక బాలకృష్ణ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా తల్లి బసవతారకం పేరు మీద అత్యాధునిక సౌకర్యాలతో ‘బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ను 2000 సంవత్సరంలో ప్రారంభించారు. దీనికి నందమూరి బాలకృష్ణ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేవిధంగా ఈ హాస్పిటల్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు కొన్ని వేలమందికి ఈ హాస్పిటల్‌ ద్వారా వైద్య సేవలు అందించారు. 

వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1982లో 22 ఏళ్ళ వయసులో వసుంధరాదేవిని వివాహం చేసుకున్నారు బాలకృష్ణ. వీరికి ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ. పెద్ద కుమార్తె బ్రాహ్మణి వివాహం.. చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్‌తో జరిగింది. అలాగే రెండో కుమార్తె తేజస్వినికి వైజాగ్‌ ఎం.పి. భరత్‌తో వివాహం జరిపించారు. కుమారుడు మోక్షజ్ఞను తన నట వారసుడిగా పరిచయం చెయ్యాలనే ప్రయత్నాలు గత కొంతకాలంగా జరుగుతున్నాయి. ఒక మంచి సినిమా ద్వారా మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘అఖండ2’ చిత్రం చేస్తున్నారు బాలకృష్ణ. ఈ చిత్రం సెప్టెంబర్‌ 25న విడుదల కాబోతోంది. మరో విశేషం ఏమిటంటే.. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ చేస్తున్న ‘జైలర్‌2’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.